Pawan Kalyan: కొండగట్టుకు కదిలిన జనసేనాని!
- ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేటి నుంచి యాత్ర
- మధ్యాహ్నం 3 గంటలకు కొండగట్టు చేరుకోనున్న పవన్
- ఆపై సాయంత్రానికి కరీంనగర్ కు
- రెండు రోజుల వ్యవధిలో ఆరు జిల్లాల కార్యకర్తలతో భేటీ
ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను గురించి తెలుసుకోవడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పవన్, ఈ ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరనున్నారు. ఇప్పటికే జనసేన కార్యాలయం వద్దకు పవన్ అభిమానులు పెద్దఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
మధ్యాహ్నం 3 గంటల సమయానికి కొండగట్టుకు చేరుకోనున్న పవన్, స్వామి దర్శనానంతరం కరీంనగర్ చేరుకోనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి, ఆపై రేపు ఉదయం 10.40కు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం నుంచి బయలుదేరి రాత్రికి కొత్తగూడెం చేరుకుని అక్కడ బస చేస్తారు. బుధవారం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు వెళ్లి, మధ్యాహ్నం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తారు.