Japan: రెండో ప్రపంచ యుద్ధం తరువాత తొలిసారిగా... యుద్ధ భయంతో వణుకుతున్న జపాన్!
- దశాబ్దాల తరువాత మిలటరీ డ్రిల్
- క్షిపణి దూసుకొస్తోందని మైకుల్లో ప్రకటన
- ప్రజల్లో అవగాహన కోసమేనన్న జపాన్
పక్కనే ఉన్న ఉత్తర కొరియా నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని భావిస్తున్న జపాన్, రెండో ప్రపంచయుద్ధం తరువాత తొలిసారిగా యుద్ధ భయంతో వణికిపోతోంది. ఎన్నో దశాబ్దాల తరువాత తొలిసారిగా మిలటరీ డ్రిల్ చేసి, అత్యవసర పరిస్థితి ఏర్పడితే, రాజధాని టోక్యోను ఎలా వదిలి వెళ్లాలన్న విషయమై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా నగరమంతా మైకుల ద్వారా అణుబాంబు పడనుందని హెచ్చరికలు చేస్తూ, తక్షణమే అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవాలని సూచించింది. టోక్యో అమ్యూజిమెంట్ పార్క్ వేదికగా ఈ డ్రిల్ జరిగింది.
అక్కడున్న వారందరికీ "మిసైల్ దూసుకొస్తోంది. మిసైల్ దూసుకొస్తోంది" అని కేకలు పెడుతూ పోలీసులు పరుగులు పెట్టారు. ప్రతి ఒక్కరూ భవనాల్లోకి, భూగర్భ గృహాల్లోకి, పక్కనే ఉన్న సబ్ వే రైల్వే స్టేషన్ లోకి నిదానంగా వెళ్లిపోవాలని సూచించారు. ఆపై కొన్ని నిమిషాల తరువాత, మిసైల్ గ్రేటర్ టోక్యో రీజియన్ దాటి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిపోయిందన్న అనౌన్స్ మెంట్ వినిపించింది. కాగా, ఇంతవరకూ జపాన్ లో భూకంపం వస్తే ఎలా తప్పించుకోవాలన్న విషయంలోనే ప్రజల్లో అవగాహన పెంచేందుకు తరచూ మిలిటరీ డ్రిల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు అణు యుద్ధం ముప్పు కూడా పొంచి వుండటంతో, నగరంలో మరిన్ని భూగర్భ గృహాలను నిర్మిస్తోంది.