harman preet kour: టీమిండియా చేసిన తప్పు మేము చేయం!: హర్మన్ ప్రీత్ కౌర్
- వరుస వైఫల్యాలతో టీమిండియాపై విమర్శలు
- టీమిండియా చేసిన పొరపాట్లు పునరావృతం కానివ్వం
- సఫారీ గడ్డపై వీలైనంత త్వరగా అడుగుపెట్టాలి
- సఫారీలతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలి
సఫారీ పర్యటనకు వెళ్లిన టీమిండియా వరుస టెస్టుల్లో విఫలం కావడంతో జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోటీస్ ను ఢీ కొట్టేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. దీంతో ముంబైలోని అకాడమీలో క్రీడాకారిణులు ప్రాక్టీస్ ప్రారంభించారు. సఫారీ సిరీస్ కు సన్నద్దత గురించి జట్టు వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, టీమిండియా చేసిన పొరపాట్లను తాము చేయమని తెలిపింది. సఫారీ గడ్డపై వీలైనంత త్వరగా అడుగు పెట్టాలని ఆసక్తిగా ఉన్నామని చెప్పింది.
కోహ్లీ సేన సౌతాఫ్రికా పర్యటనకు ముందు సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్ లు ఆడడం వల్ల, ఆటగాళ్లకు అవసరమైన విశ్రాంతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లిందని తెలిపింది. సౌతాఫ్రికాలో పరిస్థితులకు అలవాటు పడటం అంత సులువు కాదని చెప్పింది. ఈ ప్రాక్టీస్ క్యాంపు తమకెంతో సాయపడుతోందని పేర్కొంది. జట్టులోకి కొత్త అమ్మాయిలు కూడా వచ్చారని తెలిపింది. గతేడాది ప్రపంచకప్ కు ముందు తాము చాలా మ్యాచ్ లు ఆడామని, వరల్డ్ కప్ తరువాత ఇప్పటి వరకు ఆడలేదని గుర్తు చేసింది. అందుకే సఫారీలతో ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాలనుకుంటున్నామని తెలిపింది. ప్రాక్టీస్ మ్యాచ్ ల తరువాతే తాము సిరీస్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లని హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది.