TRS: పవన్ రాజకీయాల్లో అప్పుడప్పుడు కనిపిస్తారు.. ఆయనతో ఒప్పందాలు లేవు!: టీఆర్ఎస్
- మాతో పవన్ కల్యాణ్ ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు
- ఇటీవల పవన్ కొత్త సినిమాను ఐదు షోలు ప్రదర్శించే అవకాశం ఇచ్చాం
- పవన్ సినీ నటుడిగానే ఇటీవల కేసీఆర్‌ను కలిశారు
- ఆయన చేస్తోన్న పర్యటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు- కర్నె ప్రభాకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, సినీనటుడు పవన్ కల్యాణ్‌కి మధ్య ఎటువంటి ఒప్పందమూ జరగలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలో పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని తన రాజకీయ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నె ప్రభాకర్ స్పందిస్తూ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఆయనను తాము ప్రస్తుతానికి సినిమా నటుడిగానే భావిస్తున్నామని అన్నారు.
పవన్ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో అప్పుడప్పుడు కనిపిస్తారని, ఒక్కోసారి కనుమరుగవుతున్నారని కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. 'కొండగట్టు నుంచి రాజకీయ యాత్రను ప్రారంభిస్తానంటూ ప్రారంభించారు.. రాజకీయాలు చేసే ఆసక్తి ఉంటే ఆయనకు ఆల్ ది బెస్ట్. కానీ, టీఆర్ఎస్ పార్టీ ఆయనతో అంతర్గత ఒప్పందాలు చేసుకునేంత బలహీనంగా లేదు. ఇటీవల పవన్ కొత్త సినిమాను ఐదు షోలు ప్రదర్శించే అవకాశం ఇచ్చాం. అంత మాత్రాన పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా ఉన్నట్లు కాదు. ఆయనతో రాజకీయ పరమైన ఏ అంశం కూడా ప్రస్తావనకు రాలేదు. పవన్ సినీ నటుడిగానే ఇటీవల కేసీఆర్‌ను కలిశారు. ఆయన చేస్తోన్న పర్యటనతో మాకు ఎలాంటి సంబంధం లేదు' అని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు.