Andhra Pradesh: ‘కొల్లేటి’ సమస్య పరిష్కారానికి ‘కేంద్రం’ సానుకూల స్పందన
- కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ని కలిసిన ఏపీ మంత్రి కామినేని
- పర్యావరణానికి, సరస్సు నీటి ప్రవాహానికి ముప్పు వాటిల్లకుండా చూడాలని కోరారు
- ఫిబ్రవరి 4 నుంచి ‘ఫెలికాన్ ఫెస్టివల్: కామినేని
కొల్లేరు సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ ని ఆయన ఈరోజు కలిశారు. ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, పర్యావరణానికి, కొల్లేరు సరస్సు నీటి ప్రవాహానికి ముప్పు వాటిల్లకుండా చూడాలని కోరానని అన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న కొల్లేరు సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం కోసమే మంత్రిని ఈరోజు ఉదయం కలిశానని, ఆయన స్వగృహంలో కలిసి ఓ వినతపత్రం సమర్పించానని చెప్పారు.
కొల్లేటి సరస్సు కాంటూరు పరిధి 5 నుంచి 3కు తగ్గించే అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు లోబడి కొల్లేటి సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలు జీవనోపాధిని కోల్పోకుండా తగు సహాయం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
కొల్లేటి సరస్సుపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా ఏ విధమైన నష్టపరిహారం చెల్లించ లేదని, సొంత భూములు కలిగిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించలేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు. కొల్లేటి సరస్సుపై ఆధారపడి 133 సొసైటీల పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల భూమిపై పేద ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, జీవనోపాధి లేక ఇప్పటికే చాలా కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు కామినేని వెల్లడించారు.
దీంతోపాటు 14 వేల ఎకరాల జిరాయితీ భూమిగల రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నందున వీరందరికీ కూడా ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించే ఆవశ్యకత ఉందని వివరించినట్లు చెప్పారు. పర్యావరణం, కొల్లేటి సరస్సు నీటిపారుదలకు ముప్పు వాటిల్లకుండా కొల్లేటి సరస్సు విస్తరించి వున్న కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులను ఆసరాగా చేసుకొని కొల్లేటి ప్రాంత ప్రజలకు జీవనోపాధి అవకాశాలను కల్పించి ఆదుకోవాలని కోరానని అన్నారు. కొల్లేటి సరస్సులో విడిది చేసేందుకు వచ్చే ఫెలికాన్ పక్షులకు, పర్యావరణానికి ఏ విధమైన నష్టం వాటిల్లకుండా కైకలూరు నియోజకవర్గం, కైకలూరు, ఆటపాకలలో ఫిబ్రవరి 4 నుంచి ‘ఫెలికాన్ ఫెస్టివల్’ ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కామినేని శ్రీనివాస్ వివరించారు.
ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ అంశాలపై చర్చ
ఏపీలోని వైద్య, ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను, వీటికి కావాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులతో చర్చించినట్లు కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్.టి.ఆర్. వైద్య సేవలను మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న వైద్య సేవల ఇన్సూరెన్స్ పథకం పరిధిలోకి ఎన్.టి.ఆర్. వైద్య సేవల పథకాన్ని కూడా చేర్చాలనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినట్లు చెప్పారు.