IPL: స్టార్ స్పోర్ట్స్ విన్నపంతో.. ఐపీఎల్ ఆటల వేళలు మారాయి!
- జనవరి 27, 28 తేదీలలో 578 మంది ఆటగాళ్ల వేలం
- ఏప్రిల్ 7 నుంచి మే 27వరకు ఐపీఎల్
- ఆట వేళల్లో మార్పు
ఐపీఎల్ టైమింగ్స్ మారాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి గతేడాది వరకు వారాంతాల్లో మినహా మ్యాచ్ లు రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యేవి. వారాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ఒక మ్యాచ్ ఆరంభం కాగా, తిరిగి రాత్రి 8 గంటలకు మరొక మ్యాచ్ వుండేది. దీంతో లేట్ నైట్ వీక్షకుల ఆదరణ తగ్గింది. దీనిని పునరావృతం కానివ్వకుండా చూడాలని బీసీసీఐని ప్రసార కర్త స్టార్ స్పోర్ట్స్ కోరింది. దీంతో బీసీసీఐ ఆట వేళలు మార్చింది.
ఈ క్రమంలో ఇకపై 4 గంటలకు ఆరంభమయ్యే మ్యాచ్ లు సాయంత్రం 5:30 నిమిషాలకు మొదలవుతాయి. అలాగే, రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ లు గంట ముందుగా అంటే సాయంత్రం 7 గంటలకే ఆరంభం కానున్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకు జరగనున్న ఐపీఎల్ సీజన్ కొత్త వేళలతో కొనసాగుతుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అలాగే ప్రారంభోత్సవం టోర్నీని ఆరంభానికి ఒక రోజు ముందుగా అంటే ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. జనవరి 27, 28 తేదీలలో 360 మంది భారత ఆటగాళ్లతోపాటు మొత్తం 578 ఆటగాళ్లను వేలంలో ఉంచనున్నామని, అప్పటికి ఐపీఎల్ జట్లపై పూర్తి స్పష్టత రానుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ ఏడు హోం మ్యాచ్ లలో నాలుగు మొహాలీలో, మూడు ఇండోర్ లో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆడాల్సిన ఏడు హోం మ్యాచ్ ల వేదికలను ఈనెల 24న జరిగే కోర్టు విచారణ తర్వాత నిర్ణయించనున్నారు.