YSRCP: కోస్తాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర... ప్రజల ఘన స్వాగతం!
- పునబాక వద్ద నెల్లూరులోకి ప్రవేశించిన జగన్
- పూలవర్షం కురిపించిన ప్రజలు
- 69 రోజుల క్రితం మొదలైన ప్రజా సంకల్పయాత్ర
దాదాపు 70 రోజులుగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ఈ ఉదయం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తికి సమీపంలోని పెళ్లకూరు మండలం పునబాక వద్ద జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించగా, ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. జగన్ పై ప్రజలు పూలవర్షం కురిపించారు.
69 రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర, ఆపై కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దాదాపు 900 కిలోమీటర్లకు పైగా సాగింది. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యల గురించి తెలుసుకుంటూ, ప్రతి రోజూ బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తున్న ఆయన, వీలు చిక్కినప్పుడల్లా, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మరో ఏడాదిలో రాజన్న రాజ్యం వస్తుందని జగన్ భరోసా ఇస్తున్నారు.
45 ఏళ్లు నిండిన పేదలకు రూ. 2 వేలు పింఛన్, సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు తదితర హామీలను 'నవరత్నాలు'గా ప్రకటించారు. కాగా, జగన్ పాదయాత్ర, నెల్లూరు జిల్లాలో సుమారు 20 రోజులకు పైగా సాగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని దాదాపు 400 కిలోమీటర్ల దూరాన్ని ఆయన కాలినడకన చుట్టి రానున్నారు.