shivsena: బీజేపీతో పొత్తుకు దూరం... శివసేన సంచలన నిర్ణయం
- లోక్ సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
- పార్టీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
- మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని ప్రతిజ్ఞ
గతంలో సుదీర్ఘకాలం పాటు బీజేపీ మిత్ర పక్షంగా, ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా శివసేన కలసి ప్రయాణం చేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చేశాయి. మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ, శివసేన సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. బీజేపీతో బంధాన్ని శివసేన తెగదెంపులు చేసుకుంది.
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోరాదని, ఒంటరిగానే పోరాటం చేయాలని శివసేన నిర్ణయం తీసుకుంది. పార్టీ నేత సంజయ్ రౌత్ ఇందుకు సంబంధించి ముంబైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకాభిప్రాయంతో పార్టీ ఆమోదించడం విశేషం. 48 లోక్ సభ స్థానాలకు గాను కనీసం 25 చోట్ల, 288 శాసనసభ స్థానాలకు గాను 150 చోట్ల విజయం సాధించాలని తీర్మానించుకుంది.