bcci: బీసీసీఐ మీద ఫ్రాంచైజీల అసంతృప్తి.. ఐపీఎల్ మ్యాచ్‌ల ఆరంభ వేళలు మార్చడమే కారణం
- బీసీసీఐ తమతో చర్చించలేదని అసహనం
- ఒప్పందంలో వెల్లడించలేదని వ్యాఖ్య
- తాము కూడా మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని వెల్లడి
గత పది సీజన్లుగా ఉన్న ఐపీఎల్ మ్యాచ్ ఆరంభ వేళలను మారుస్తూ బీసీసీఐ ఆకస్మిక ప్రకటన చేయడంపై ఫ్రాంచైజీలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ విషయం గురించి బీసీసీఐ తమతో చర్చించలేదని, ఒప్పంద పత్రాల్లో కూడా ఈ విషయం గురించి ప్రస్తావించలేదని కొన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు వెల్లడించాయి. అందరిలాగే తాము కూడా మీడియా ప్రకటన ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని వారు అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి తమతో చర్చించి ఉంటే బాగుండేదని వారు అన్నారు.
ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 4 గం.లకు, రాత్రి 8 గం.లకు ప్రారంభమయ్యేవి. అయితే ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా స్టార్ టీవీ వారి విజ్ఞప్తి మేరకు ఇక నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను సాయంత్రం 5:30 గం.లకు, రాత్రి 7 గం.లకు ప్రారంభించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్‌కి సంబంధించి ఈ నెల 27, 28 తేదీల్లో ఆటగాళ్ల వేలం జరగనున్న సంగతి తెలిసిందే.