mission kakatitya: మిషన్ కాకతీయ మీడియా అవార్డులు.. ఎంట్రీలు పంపేందుకు చివరి తేదీ, వివరాలు
- జన జీవితంపై ఈ పథక ప్రభావంపై చేసిన ప్రచురణలు, ప్రసారాలకు అవార్డులు
- చివరి తేదీ ఈ నెల 31
- మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు
- పత్రికల్లో అచ్చయిన ఫోటోలతో పాటు ఒరిజినల్ ఫోటోలు కూడా పంపాలి
మిషన్ కాకతీయ మీడియా అవార్డులకు ఎంట్రీలు పంపేందుకు చివరి తేదీ ఈ నెల 31 అని తెలంగాణ భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కార్యాలయం తెలిపింది. విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పథకంకు సహకరించిన జర్నలిస్టులను సత్కరించేందుకు అవార్డులను ప్రకటించనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ కాకతీయ గురించి అద్భుతంగా కథనాలు రాసిన పత్రికా జర్నలిస్టులు, ప్రసారం చేసిన టీవీ జర్నలిస్టులు, ఇతర వార్తా సంస్థలకు తగిన రీతిలో అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ జన జీవితంపై మిషన్ కాకతీయ పథకం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై ఎంట్రీలను పంపించాల్సిందిగా ఆయన కోరారు. జనవరి 1, 2017 నుంచి డిసెంబర్ 31, 2017 వరకు పత్రికల్లో అచ్చయిన, టీవీ న్యూస్ ఛానెళ్లలో ప్రసారమైన కథనాలు స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు. ఎంట్రీలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఆన్లైన్ మీడియా, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ఫ్రీలాన్సింగ్, విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ ల కేటగిరీల వారీగా పంపించాలని చెప్పారు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మూడు విభాగాలుగా మూడు బహుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేల చొప్పున ప్రదానం చేస్తామని వివరించారు. మిగిలిన కేటగిరిలకు విడిగా బహుమతులు ఉంటాయని వివరించారు. ఎంట్రీలతోపాటు ఆయా వార్తలు, విశ్లేషణల క్లిప్పింగ్‌లను తప్పనిసరిగా పంపించాలని తెలిపారు.
ఎంట్రీలను శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఓఎస్డి, ఇరిగేషన్ శాఖ, డి-బ్లాక్, గ్రౌండ్‌ఫ్లోర్, సచివాలయం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం చిరునామాకు పంపాలని తెలిపారు. ఫోటోల క్యాటగిరీలో అవార్డుకు పంపించేవారు పత్రికల్లో అచ్చయిన ఫోటోలతో పాటు ఒరిజినల్ ఫోటోలు కూడా పంపాలని అన్నారు. అలాగే, టీవీ చానళ్లలో ప్రసారమైన కథనాల సీడీలను పంపాలని అన్నారు. పత్రికల్లో అచ్చయిన వార్తాకథనాలు మొత్తం 5 క్లిప్పింగులు పంపాలని వివరించారు.