Davos: బడ్జెట్ తరువాత కూడా నాపై ఇదే అభిప్రాయం ఉంటుందేమో చూస్తా!: కంపెనీల చీఫ్ లతో ప్రధాని మోదీ
- దావోస్ లో సీఈఓలతో సమావేశమైన ప్రధాని
- బడ్జెట్ లో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్న సంకేతాలు
- దాదాపు 52 నిమిషాలు సాగిన మోదీ ప్రసంగం
ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, 100కు పైగా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ తో సమావేశమైన వేళ, కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ ప్రతిపాదనల తరువాత కూడా తనను సీఈఓలు ఇంతే స్థాయిలో ఇష్టపడతారా? అన్నది చూస్తానని ఆయన అన్నారు.
రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ నుంచి ఆర్సిలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్, ఐసీఐసీఐ చీఫ్ చంద కొచ్చర్, ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తదితర ఎందరో ప్రముఖులను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన, బడ్జెట్ లో కొన్ని వడ్డనలు ఉండక తప్పవన్న సంకేతాలు పంపారు.
ఇక తన ప్రసంగం అనంతరం సీఈఓలతో ఫోటోలు తీస్తున్న వేళ, 'మీరంతా నవ్వరేంటి?' అని ప్రశ్నించి అక్కడున్న వాతావరణాన్ని తేలిక పరిచే ప్రయత్నం చేశారు. కాగా, మోదీ దాదాపు 52 నిమిషాల పాటు ప్రసంగించడం చాలా మందికి అసహనాన్ని తెప్పించిందని సమాచారం. కార్పొరేట్ సెక్టారుకు ఈ బడ్జెట్ కొంత ప్రతికూలంగా ఉంటుందని భావిస్తున్నామని మోదీ ప్రసంగం తరువాత పలువురు సీఈఓలు వ్యాఖ్యానించడం గమనార్హం.