maoist: మావోయిస్టు ఉద్యమం 58 జిల్లాలకు పరిమితం! బలగాల దాడితో పల్చనవుతున్న క్యాడర్
- రాత్రీ, పగలు బలగాల ఆపరేషన్లు
- సీఆర్పీఎఫ్, ఐఏఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, రాష్ట్ర బలగాల భాగస్వామ్యం
- మరోవైపు అభివృద్ధి పనులు
దేశంలో మావోయిస్టుల ఉనికి క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో నిత్యం హింసాత్మక చర్యలు, దాడులతో మార్మోగిపోయిన మావోయిస్టుల ఉద్యమం భద్రతా బలగాల ఆపరేషన్ తో క్రమంగా బలహీనపడుతోంది. నేడు 58 జిల్లాల పరిధిలోనే మావోయిస్టుల చర్యలు కనిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ నిఘా, డ్రోన్ల వినియోగం, రాత్రీ, పగలు ఆపరేషన్ వంటి చర్యలు ఫలితాలనిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలను సైతం బలగాలు జల్లెడపడుతున్నాయి.
సీఆర్పీఎఫ్ తాజా గణాంకాల ప్రకారం, మావోయిస్టుల ఆధిపత్యం కొనసాగుతున్న జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 90 శాతానికి పైగా దాడులు బిహార్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. 2015లో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పరిధిలో 75 జిల్లాలలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు చోటు చేసుకోగా, 2016లో 67 జిల్లాల్లోనే ఈ ఘటనలు జరిగాయి. ఇక 2017లో కేవలం 58 జిల్లాలకే మావోయిస్టుల దాడులు పరిమితమయ్యాయి.
సీనియర్ మావోయిస్టు నేతలు, ఇన్ ఫార్మర్లను ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా టార్గెట్ చేసుకోవడం సత్ఫలితాలను ఇస్తోంది. సీఆర్పీఎఫ్, ఐఏఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, రాష్ట్ర బలగాలు కలసి సంయుక్త ఆపరేషన్లు కూడా చేపడుతున్నాయి. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల ఏర్పాటు జరుగుతోంది. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ మాట్లాడుతూ... ‘‘ప్రస్తుతం నక్సల్స్ ప్రభావం మూడు ప్రాంతాలు బస్తర్ - సుకుమా (1,200 చదరపు కిలో మీటర్ల ప్రాంతం), ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతం (2,000 చదరపు కిలోమీటర్ల పరిధి), అబూజ్ మడ్ అటవీ ప్రాంతానికి (4,500 చదరపు కిలోమీటర్లు) పరిమితమైంది. ఈ ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా చేరుకోలేని పరిస్థితి ఉంది’’ అని వివరించారు.