amaravathi: అమరావతిలో ఫిబ్రవరి 3 నుంచి బౌద్ధ సాంస్కృతి ఉత్స‌వాల‌ు: ఏపీ మంత్రి అఖిలప్రియ

  • బుద్ధిజాన్నిపర్యాటక శాఖ ప్రమోట్ చేస్తోంది
  • ప్రపంచ శాంతి కోసమే ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం
  • హాజరుకానున్న2 వేల మంది బౌద్ధ భిక్షువులు : అఖిల ప్రియ

ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అమ‌రావ‌తి బౌద్ధ సాంస్కృతి ఉత్స‌వాల‌ను ప్రారంభం కానున్నట్టు పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ తెలిపారు. అమరావతిలోని ఏపీ స‌చివాల‌యంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. బుద్ధిజాన్ని పర్యాటక శాఖ ప్రమోట్ చేస్తోందని, ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని అన్నారు. హీన‌యాన బౌద్ధ ధ‌ర్మం పుట్టిన న‌వ్యాంధ్ర... సాంస్కృతిక రాజ‌ధాని అని చాటి చెప్ప‌డ‌మే ఈ ఉత్స‌వాల ల‌క్ష్య‌మ‌ని అన్నారు. ఈ ఉత్స‌వాల‌కు దేశ విదేశాల నుంచి భారీగా బౌద్ధ భిక్షువులు, ప్ర‌ముఖులు త‌ర‌లివ‌స్తార‌ని చెప్పారు. వీరంతా అమ‌రావ‌తి బౌద్ధ స్తూపంతో పాటు నాగార్జున‌కొండ‌, తొట్ల‌కొండ‌, అనుపు, వంటి బౌద్ధారామాల‌న్నీ సంద‌ర్శించ‌డంతో విదేశీ టూరిజానికి ఇది ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని అన్నారు.

ఈ ఉత్సవాలకు రెండు వేల మంది బౌద్ధ భిక్షువులు రానున్నారని, రాష్ట్రంలోని వంద బౌద్ధ క్షేత్రాల్లో ఈ బృందాలు పర్యటించనున్నట్టు తెలిపారు.ఫిబ్ర‌వ‌రి 3న ఈ ఉత్స‌వాలు ప్రారంభం అవుతాయ‌ని, ఇందులో బౌద్ధ గురువుల సందేశాలు, సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌ని తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 4న విశ్వ‌శాంతి కోసం బౌద్ధ భిక్షువులు ప్రార్థన‌లు చేస్తార‌ని, ఇందులో వెయ్యి మంది బౌద్ధులు పాల్గొంటున్నార‌ని తెలిపారు. కొలంబో నుంచి తొలి బౌద్ధ స‌న్యాసిని భిక్కున్ని కుసుమ కూడా వ‌స్తున్నార‌ని, టిబెట్ తో పాటు మ‌లేషియా, సింగ‌పూర్, శ్రీలంక‌, అమెరికా త‌ర‌దిత‌ర దేశాల నుంచి బౌద్ధ గురువులు వ‌స్తున్నార‌ని, వీరితో క‌లిసి ఆన్ లైన్ లో వేల మంది దేశ, విదేశీయులు ఛాంటింగ్ లో పాల్గొంటార‌ని వివ‌రించారు. న‌వ్యాంధ్ర‌లో  ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న ఈ బౌద్ధ ఉత్స‌వాల‌కు ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారం కావాల‌ని కోరారు.

టూరిజం శాఖ కార్య‌ద‌ర్శి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, అమ‌రావ‌తి బౌద్ధ ఉత్స‌వాల ద్వారా విదేశీ ప‌ర్యాట‌కుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాది ప‌ర్యాట‌క‌ శాఖ‌లో అభివృద్ధి రేటు 11 శాతం పెరిగింద‌ని అన్నారు. న‌వ్యాంధ్ర‌కు ప‌ర్యాట‌కుల రాక గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని, అయితే, విదేశీ ప‌ర్యాట‌కులు ఎక్కువ మంది వ‌స్తే, త‌ద్వారా రాష్ట్రానికి ఆదాయం మ‌రింత పెరుగుతుంద‌ని అన్నారు. ఏపీటీడీసీ ఎం.డి. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించే బౌద్ధ ఉత్స‌వాల‌కు బెంగ‌ళూరు, బుద్ధ గ‌య‌, ధ‌ర్మ‌శాల‌, హుబ్లీ త‌దిత‌ర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చే బౌద్ధ భిక్షువుల కోసం వంద బ‌స్సులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు  పేర్కొన్నారు.క‌న‌క స‌భ ఆర్ట్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ సిరి రామ‌, అమెరికా నుంచి బౌద్ధాచార్యులు ప్ర‌జ్వ‌ల ర‌త్న వ‌జ్రాచార్య‌, ముంబై నుంచి మ్యూజిక్ కంపోజ‌ర్ రాజేష్ ద‌బ్రీ త‌దిత‌రులు వ‌స్తున్నార‌ని తెలిపారు.  

  • Loading...

More Telugu News