chittorgarh fort: 'పద్మావత్' దెబ్బ.. చరిత్రలోనే రెండోసారి మూతపడ్డ అద్భుతమైన కోట!
- జౌహార్ కోసం 1900 మహిళల రిజిస్ట్రేషన్
- చిత్తోర్ కోటలో సామూహిక జౌహార్ కు యత్నాలు
- ఉద్రిక్తతల మధ్య మూతపడ్డ కోట
సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'పద్మావత్' సినిమాను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ... రాజస్థాన్ లో ఈ సినిమా విడుదల కావడం కష్టంగానే కనిపిస్తోంది. రాజ్ పుత్ కర్ణిసేన కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సినిమాను ప్రదర్శించలేమని వారు చేతులెత్తేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ లోని అద్భుతమైన చిత్తోర్ కోట మూత పడింది. 'పద్మావత్' విడుదలైతే వందలాది మంది రాజ్ పుత్ స్త్రీలు మూకుమ్మడిగా ఈ కోటలో ఆత్మహత్యకు (జౌహార్) పాల్పడతారని రాజ్ పుత్ కర్ణిసేన హెచ్చరించింది. ఈ క్రమంలో వారు భారీ సంఖ్యలో కోటలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. కోటను మూసి వేశాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోట మూతపడటం చరిత్రలోనే ఇది రెండోసారి. రాణి పద్మావతి ఇతర మహిళలతో కలసి ఈ కోటలోనే జౌహార్ కు పాల్పడిందని అంటారు. అగ్నిలోకి దూకి ఆమె ఆత్మహత్య చేసుకుందని ఓ కథనం ప్రచారంలో వుంది.
మొత్తం 1900 మంది మహిళలు జౌహార్ కోసం రిజిస్టర్ చేసుకున్నారంటూ కర్ణిసేన ప్రతినిధి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను సినిమాను విడుదల కానివ్వబోమని కర్ణిసేన నేత లోకేంద్ర సింగ్ కల్వీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలువురు కర్ణిసేన సభ్యులను పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు.