Telugudesam: వైకాపా నేతతో కలసి తొలుత సంచలన వ్యాఖ్యలు.. ఆపై యూటర్న్ తీసుకున్న విష్ణుకుమార్ రాజు!
- పీఏసీ చైర్మన్ తో కలసి మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు
- నేను పార్టీ మారాలంటే రాజీనామా చేసుండేవాడిని
- వ్యాఖ్యలన్నీ నా వ్యక్తిగతమే తప్ప పార్టీ విధానం కాదు
- ఓ టీవీ చానల్ తో విష్ణుకుమార్ రాజు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజా పద్దుల కమిటీ చైర్మన్, వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్కనే కూర్చొని మీడియాతో మాట్లాడిన వేళ, వైసీపీ నుంచి ఫిరాయించి, ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న వారంతా రాజీనామా చేయాలని, లేకుంటే ఫిరాయింపుదారులు మంత్రులు కావచ్చని చట్టం తేవాలని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు యూటర్న్ తీసుకున్నారు.
ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయానికి ప్రతిబింబం కాదని అన్నారు. తాను వైసీపీ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడటం కేవలం యాదృచ్ఛికమేనని తెలిపారు. తాను వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచుండి, ఆపై టీడీపీలో చేరాలని భావిస్తే రాజీనామా చేసుండేవాడినని, అదే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీ వ్యాఖ్యలుగా భావించవద్దని అన్నారు. అవసరాన్ని బట్టి పార్టీ మారే వ్యక్తిని కాదని చెప్పారు. తాను వైకాపా కార్యాలయానికి వెళితే తప్పేంటని తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలను ప్రశ్నించారు.