Pakistan: పాకిస్థాన్లో 'పద్మావత్' చిత్రానికి సెన్సార్ పూర్తి... 'యూ' సర్టిఫికెట్ జారీ
- అల్లా ఉద్దీన్ ఖిల్జీని తప్పుగా చూపించారంటూ అక్కడ కూడా అభ్యంతరం
- చరిత్రకారుడి సలహాతో అనుమతి జారీ చేసిన పాక్ సీబీఎఫ్సీ
- భారత్లో యూ/ఏ సర్టిఫికెట్
భారత్లో ఆంక్షలు, వివాదాల మధ్య విడుదలైన 'పద్మావత్' చిత్రం పాకిస్థాన్లో కూడా విడుదలకు సిద్ధమైంది. ఆ దేశ సీబీఎఫ్సీ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. అక్కడ ఈ సినిమాకు 'యూ' సర్టిఫికెట్ జారీ చేయడం గమనార్హం. భారత్లో 'పద్మావత్' సినిమాకు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్లో కూడా ఈ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
అల్లా ఉద్దీన్ ఖిల్జీని తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఖైద్-ఈ-అజాం యూనివర్సిటీకి చెందిన చరిత్ర అధ్యాపకుడు వఖార్ అలీ షా సలహా మేరకు ఈ చిత్ర సెన్సార్ పూర్తి చేసినట్లు పాక్ సీబీఎఫ్సీ అధికారి మొబాషిర్ హసన్ తెలిపారు. మరోవైపు భారత్లో సినిమా విడుదలైనప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కర్ణిసేనలు విధ్వంసం సృష్టిస్తున్నారు. థియేటర్లను ధ్వంసం చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు.