gold rate: బంగారం ధరకు రెక్కలు.. రెండేళ్ల గరిష్ట స్థాయికి పుత్తడి
- రూ. 30,405కు చేరుకున్న బంగారం ధర
- డాలర్ పతనమే కారణం
- ధర మరింత పెరుగుతుందన్న రాయిటర్స్ విశ్లేషకుడు
దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్ల గరిష్ట స్థాయిని ఈరోజు తాకాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 156 పెరిగి ప్రస్తుతం రూ. 30,405కు చేరుకుంది. అమెరికన్ డాలర్ విలువ తగ్గడంతో, పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ ధర 1360.60 డాలర్లకు చేరుకుంది. 2016 ఆగస్టు నాటి ధర 1361.87 డాలర్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో రాయిటర్స్ విశ్లేషకుడు వాంగ్ టావో మాట్లాడుతూ, బంగారం ధరలు మరింత పుంజుకుంటాయని చెప్పారు.
అమెరికన్ డాలర్ విలువ పతనం కావడానికి యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ మ్యుచిన్ చేసిన వ్యాఖ్యలే కారణం. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఆయన మాట్లాడుతూ వాణిజ్యానికి, ఇతర అవకాశాలకు సంబంధించినంత వరకు డాలర్ బలహీనం కావడం తమకు మంచిదేనని అన్నారు. దీంతో, మార్కెట్లో డాలర్ అమ్మకాలకు తెరలేచింది. దీని ప్రభావంతో, పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి.