Padmavat: దీపిక చేసిన నృత్యం మనకు వద్దు: ఉదయ్ పూర్ లో 'ఘూమర్' సాంగ్ పై బ్యాన్!
- తీవ్ర నిరసనల ఫలితంగా కలెక్టర్ కీలక నిర్ణయం
- రిపబ్లిక్ డే వేడుకల్లో 'ఘూమర్' పాట వద్దని ఆదేశాలు
- 'పద్మావత్' చిత్రంలో నర్తించిన దీపిక
రాజ్ పుత్ కర్ణిసేన చేస్తున్న నిరసనల ఫలితమో లేక వివాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకన్న ఆందోళనో... ఉదయ్ పూర్ పాఠశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో రాజస్థాన్ సంప్రదాయ నృత్యమైన 'ఘూమర్'ను ప్రదర్శించ వద్దన్న ఆదేశాలు వెలువడ్డాయి.
ఉదయ్ పూర్ అదనపు కలెక్టర్ ఎస్ సీ శర్మ పేరిట ఈ ఆదేశాలు వెలువడ్డాయి. 'పద్మావత్' చిత్రంలో 'ఘూమర్ ఘూమర్' పాటకు దీపికా పదుకొనే నృత్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ లోని రాట్లాంలో కర్ణిసేన కార్యకర్తలు 'ఘూమర్' పాటకు నృత్యం చేస్తున్న పాఠశాల విద్యార్థులపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో సైతం 'ఘూమర్' పాటను బ్యాన్ చేస్తూ నిషేధాలు వెలువడగా, వాటిని జారీ చేసిన అధికారులకు పై స్థాయి నుంచి అక్షింతలు పడటం గమనార్హం.