Republic Day: 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ సందేశం
- ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- త్యాగమూర్తులను స్మరించుకోవడం మన విధి
- ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దాం
రేపు 69వ గణతంత్ర దినోత్సవం జరగనున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ నరసింహన్ సందేశం అందించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అందించిన సందేశం ఆయన మాటల్లోనే...
"ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఈ రోజు యావత్తు దేశం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకోవడం మన విధి. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దాం. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేడు నాల్గవ సారి గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం.
ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి కలలను సాకారం చేసేలా నా ప్రభుత్వం అనేక సంక్షేమ – అభివృద్ధి పథకాలు అమలు చేస్తోంది. వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతికి, ఐటి రంగ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు నా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో యువత భాగస్వామ్యం కావాలి. బాధ్యత గల పౌరులుగా మనందరం సమష్టిగా శ్రమించాలి. యావన్మంది రాష్ట్ర ప్రజానీకం ఆశించే బంగారు తెలంగాణ సాధన లక్ష్యంతో అహర్నిశలు, అనుక్షణం కృషి చేద్దాం. అందరికీ మరోమారు శుభాభివందనాలు".