prisoners: సంతానం పొందేందుకు ఖైదీకి సెలవు మంజూరు చేసిన హైకోర్టు!
- ఖైదీలకు దాంపత్య జీవితం గడిపే హక్కు ఉంది
- జైళ్లలో అలాంటి ఏర్పాట్లపై పరిశీలించేందుకు కమిటీ వేయండి
- ఖైదీకి రెండు వారాల సెలవు మంజూరు
నేరస్థులకు కూడా సంతానాన్ని పొందే హక్కు ఉందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, సంతానాన్ని పొందడం కోసం 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికి 2 వారాల సెలవును మంజూరు చేసింది. అవసరమైతే మరో 2 వారాలు పొడిగిస్తామని కూడా తెలిపింది. నేరస్థుడి భార్య సంతానం కావాలని కోరుకుంటున్నారని, ఆమె కోరికలో న్యాయం ఉందని, ఆమె కోరికను నిరాకరించలేమని చెప్పింది. ఈ సెలవుపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, అసాధారణ కారణాలు ఉన్నప్పుడు ఖైదీలకు సెలవు ఇవ్వొచ్చని తెలిపింది. సివిల్ డ్రెస్ లో ఉన్న ఓ పోలీసు సదరు ఖైదీకి ఎస్కార్టుగా ఉండవచ్చని చెప్పింది.
గత 18 సంవత్సరాల నుంచి ఈ ఖైదీ జైలు జీవితం గడుపుతున్నాడు. అతని భార్య వయసు 32 ఏళ్లు. వీరికి సంతానం లేకపోవడంతో... ఆమె అభ్యర్థన పట్ల జస్టిస్ విమలా దేవి, జస్టిస్ కృష్ణవల్లిలు సానుకూలంగా స్పందించారు. దాంపత్య బంధాన్ని కొనసాగించేందుకు చాలా దేశాల్లో అనుమతి ఇస్తున్నారని తెలిపిన హైకోర్టు... రాష్ట్రంలోని జైళ్లలో కూడా అలాంటి ఏర్పాట్లు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకరు జైల్లో ఉన్నప్పుడు మరొకరు జైలుకు వచ్చి, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఖైదీలకు ఉందని తెలిపింది.