akhila priya: శిల్పాల త‌యారీలో డిజిట‌ల్ టెక్నాల‌జీ... మంత్రి అఖిల ప్రియ‌ను క‌లిసి వివ‌రించిన శిల్పులు

  • సాంకేతిక‌త జోడించి శిల్పాలు త‌యారు చేసే కొత్త విధానాల ఆవిష్కరణ 
  • డిజిట‌ల్ టెక్నాల‌జీతో త‌యారు చేసిన ఎన్టీఆర్ ఫైబ‌ర్ విగ్ర‌హాన్ని మంత్రికి అందజేత
  • వెయ్యి అడుగుల వ‌ర‌కు ఫైబ‌ర్, పంచ లోహ, కంచు విగ్ర‌హాల‌ను తయారుచేసే సత్తా

శిల్పాల త‌యారీలో ఇప్పుడు డిజిట‌ల్ టెక్నాల‌జీ ముఖ్య పాత్ర పోషిస్తోంద‌ని ఏపీ ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఎన్ని వంద‌ల అడుగుల విగ్ర‌హాలు అయినా, శిల్పులు త‌మ ప్రావీణ్యానికి సాంకేతిక‌త జోడించి త‌యారు చేసే కొత్త విధానాలు వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ల్ల రామేశ్వ‌రానికి చెందిన శిల్ప క‌ళాకారుల బృందం వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో మంత్రి భూమా అఖిల ప్రియ‌ను క‌లిసింది. తాము డిజిట‌ల్ టెక్నాల‌జీతో త‌యారు చేసిన ఎన్టీఆర్ ఫైబ‌ర్ విగ్ర‌హాన్ని మంత్రికి రాష్ట్ర శిల్పి స‌మాఖ్య అంద‌జేసింది. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు స‌మాఖ్య రాష్ట్ర అధ్య‌క్షుడు త‌మ శిల్పుల స‌రికొత్త సాంకేతిక‌ను మంత్రికి వివ‌రించారు.

ఒక అడుగు నుంచి వెయ్యి అడుగుల వ‌ర‌కు ఫైబ‌ర్, పంచ లోహ, కంచు విగ్ర‌హాల‌ను డిజిట‌ల్ స్కానింగ్ ప‌ద్ధ‌తిలో ఎలా నిర్మిస్తారో ట్యాబ్ ద్వారా వివ‌రించారు. హైద‌రాబాదులోని ట్యాంక్ బండ్ పై శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు, అన్న‌మ‌య్య‌, టంగుటూరి ప్ర‌కాశం పంతులు, త్రిపుర‌నేని రామ‌స్వామి త‌దిత‌ర  విగ్ర‌హాల‌ను తామే నిర్మించామ‌ని మంత్రికి రాష్ట్ర శిల్పి స‌మాఖ్య అధ్య‌క్షుడు పి.అరుణ్ ప్ర‌సాద్ ఉద‌యార్ వివ‌రించారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల 25 అడుగుల విగ్ర‌హాల‌ను తాము డిజిట‌ల్ టెక్నాల‌జీతో నిర్మించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు. శిల్ప క‌ళాకారుల ప్ర‌తిభ‌ను మంత్రి భూమా అఖిల ప్రియ అభినందించారు.

  • Loading...

More Telugu News