Chandrababu: ‘మహీంద్రా’ గ్రూప్ అధినేత ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇది!
- దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు
- పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ
- ‘మీ విజన్ ఏమిటి?’ అని ప్రశ్నించిన ‘మహీంద్రా’ గ్రూప్ అధినేత
- ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా ఏపీని తీర్చిదిద్దడం అని సమాధానమిచ్చిన చంద్రబాబు
ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సు నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. భారత్ కు చెందిన మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో మహీంద్రా గ్రూపు మరింతగా తమ వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరారు.
సెజ్ తరహాలో ప్రపంచ శ్రేణి పారిశ్రామిక నగరం నిర్మించాలని చూస్తున్న మహీంద్రా గ్రూప్, ఇందుకు సంబంధించి రూపొందిస్తున్న ప్రణాళికను చంద్రబాబు ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ, ఆ పారిశ్రామిక నగరాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, అందుకు, అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం, ప్రణాళికలో భాగస్వామి కావాలని, అమరావతిలో పర్యావరణ రహితమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సహకరించాలని ఈ సందర్భంగా ‘మహీంద్రా’ అధినేతను బాబు కోరారు.
కాగా, ‘మీ విజన్ ఏమిటి?’ అని ప్యానల్ చర్చలో చంద్రబాబును ఆనంద్ మహీంద్ర ప్రశ్నించగా, ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా ఏపీని తీర్చిదిద్దడం తన కల అన్నారు. ‘మరి ఏపీ భారత్ కు ఆదర్శం కాదా?’ అంటూ వెంటనే ఆనంద్ మహీంద్ర ప్రశ్నించగా, మూడు నాలుగేళ్లలో భారత్ కు ఆదర్శంగా ఏపీని రూపొందిస్తామని చంద్రబాబు సమాధానమిచ్చారు. అంతకుముందు, సౌదీ అరేబియా వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి మాజీద్ అల్ ఖసబీతో చంద్రబాబు సమావేశమయ్యారు.