Ilayaraja: రెండో అత్యున్నత పురస్కారం పొందడంపై ఇళయరాజా ఏమన్నారంటే..!
- రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన ఇళయరాజా
- దక్షిణాది చిత్ర సీమకు అంకితం
- 2010లోనే ఇళయరాజాకు పద్మభూషణ్
కేంద్ర ప్రభుత్వం తనకు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను ప్రకటించడంపై మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్పందించారు. ఈ అవార్డు తనకు లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. తనకు వచ్చిన ఈ అవార్డును తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. అవార్డును ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలని అన్నారు.
2010లోనే ఇళయరాజా పద్మ భూషణ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. కాగా, నిన్న మొత్తం 85 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా, ఇళయరాజా సహా ముగ్గురికి పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. మరో 9 మందికి పద్మ భూషణ్, 73 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పలు రంగాల్లో సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.