Telangana: ప్రతి అంగుళం భూమికీ యజమానిని తేలుస్తాం: కేసీఆర్ ప్రతిన
- అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్
- గ్రామాల తరువాత పట్టణాలు, నగరాల్లో భూ ప్రక్షాళన
- అందరికీ అర్థమయ్యేలా పహాణీల తయారు
తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమాని అన్న విషయాన్ని తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ రికార్డుల తరువాత గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇలాగే అన్ని పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా ప్రతి అంగుళం భూమి ఎవరి పేరిట ఉందో తేల్చాలని అధికారులతో జరిపిన సమీక్షలో సీఎం కే చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మొత్తం ప్రక్రియ మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగే సమయానికి పూర్తి కావాలని, 5వ తేదీకల్లా పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరేలా చూసుకోవాలని తెలిపారు. ఎటువంటి వివాదానికీ తావు లేకుండా ఉండేలా పాస్ పుస్తకాలు ఉండాలని, అందుకు తగ్గట్టుగా రికార్డులను ప్రక్షాళన చేయాలని అన్నారు.
కొత్త పాస్ పుస్తకాల జారీ, భూ రికార్డుల ప్రక్షాళన, అంశాలపై ప్రగతి భవన్ లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతాకుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులతో సమీక్షించిన ఆయన పలు కీలక సూచనలు చేశారు.
అనవసర గందరగోళాలు లేకుండా పని పూర్తి చేయాలని సూచించిన ఆయన, పాస్ పుస్తకాలు, పహాణీల్లో గతంలో 31 కాలమ్స్ ఉండేవని, కాలం మారినందున ఇప్పుడన్నీ అవసరం లేదని తెలిపారు. రైతు పేరు, ఖాతా నంబర్, సర్వే, విస్తీర్ణం, భూమి పొందిన విధానం తదితర ముఖ్యమైన వివరాలు ఉంటే చాలని కేసీఆర్ సూచించారు. ఏఏ వివరాలు ఉండాలన్న విషయమై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని, దాని ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. పల్లెల్లో భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించిందని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అంగుళం భూమి లెక్క తేలిందని కేసీఆర్ చెప్పారు. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చిందని, కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్ – బిలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంతో గ్రామాల్లో భూ వివాదాలు తగ్గుతాయని భావిస్తున్నట్టు చెప్పిన ఆయన, నగరాలు, పట్టణాల్లో సైతం ఇదే వాతావరణం రావాలని కోరారు. ఇందుకోసం సమగ్ర సర్వే చేయాలని, ప్రత్యేక నంబర్లు కేటాయించే విధానం తీసుకురావాల్సి వుందని అన్నారు. ఏ భూమి ఎవరి అధీనంలో ఉంది? అక్కడ ఏం జరుగుతోందన్న విషయం ప్రభుత్వానికి తెలియాలని ఆదేశించారు. పాస్ పుస్తకంపై రైతు ఫొటో, ప్రత్యేక నంబర్ ఉండి తీరాలని, రైతులకు అర్థమయ్యేలా కొత్త పాస్ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలని సూచించారు.