USA: ముస్లిం వ్యతిరేక వీడియోలను రీ ట్వీట్ చేసినందుకు క్షమాపణలు చెప్పిన డొనాల్డ్ ట్రంప్
- ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్’ ఇంటర్వ్యూలో ట్రంప్
- ఆ దేశాల విషయంలో మాత్రం తాను కఠినంగా వ్యవహరిస్తా
- ఈ నెల 28న ప్రసారం కానున్న ఇంటర్వ్యూ
బ్రిటిష్ మితవాద సంస్థ ‘బ్రిటన్ ఫస్ట్’ డిప్యూటీ జేదా ఫ్రాన్సన్ గతంలో తమ ట్విట్టర్ ఖాతా ద్వారా మూడు ముస్లిం వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేయగా, ఆ వీడియోలను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నవంబర్ లో రీట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి ట్రంప్ ఫుల్ స్టాప్ పెట్టారు. దావోస్ లో ఐటీవీ ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్’ కార్యక్రమం కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సారీ చెప్పారు. గతంలో వారిని జాత్యంహకార ప్రజలుగా తాను అభివర్ణించినందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
అయితే, కవ్వింపు చర్యలు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల విషయంలో మాత్రం తాను కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు. ట్రంప్ పై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై కూడా ఈ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. కాగా, నిన్న జరిగిన ఈ ఇంటర్వ్యూ ఈ నెల 28న ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా, నాడు ట్రంప్ రీట్వీట్ చేసిన వీడియోలపై బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా విమర్శలు గుప్పించారు. ట్రంప్ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని థెరెసా మే వ్యాఖ్యానించడం, అందుకు కౌంటర్ గా తనను విమర్శించడం మాని బ్రిటన్ లో ఉగ్రవాదంపై దృష్టి పెట్టాలని ట్రంప్ సూచించడం విదితమే.