Karnataka: కర్ణాటక ఎన్నికల వేళ ఉద్యోగులకు భారీ బొనాంజా.. 30 శాతం వేతన పెంపు.. వచ్చే నెలలో ప్రకటించనున్న సిద్ధరామయ్య!
- కర్ణాటకలో ప్రారంభమైన ఎన్నికల సంరంభం
- ఉద్యోగులకు భారీగా వేతన పెంపు
- వచ్చే నెలలో ప్రకటన.. ప్రభుత్వంపై రూ.10,800 కోట్ల అదనపు భారం
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని 6.2 లక్షల మంది ఉద్యోగులకు 24 నుంచి 30 శాతం వేతన పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే పింఛన్‌దారులకు కూడా లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయనుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అదనంగా ఓ శనివారం సెలవు ఇవ్వాలని భావిస్తోంది. వచ్చే నెలలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారానికి ఐదు పనిదినాలు, వేతనం ఇవ్వాలన్న డిమాండ్ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఆరు పని దినాలతోపాటు నెలలో రెండో శనివారం సెలవు ఇస్తున్నారు. ఇప్పుడు నాలుగో శనివారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించనున్నారు.
ఉద్యోగులు 30-35 శాతం వేతన పెరుగుదల ఆశిస్తుండగా ప్రభుత్వం మాత్రం 24-30 మధ్య పెంచేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే కనుక జరిగితే ప్రభుత్వంపై రూ.10,800 కోట్ల అదనపు భారం పడుతుంది. కాగా, గత బీజేపీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ 22 శాతం మాత్రమే పెంచగా ఇప్పుడు అంతకుమించి పెంచడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.