Sourav Ganguly: చాపెల్ నా కెరీర్‌ను సర్వ నాశనం చేయాలని చూశాడు: తొలిసారి మనసు విప్పిన గంగూలీ!
- ‘ఎలెవన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్’ పేరుతో పుస్తకం
- పుస్తకంలో బోల్డన్ని విషయాలు వెల్లడించిన గంగూలీ
- ఐపీఎల్ సందర్భంగా విడుదల
భారత్‌కు అపూర్వ విజయాలు అందించి విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డులకెక్కిన మాజీ సారథి సౌరవ్ గంగూలీ మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో తనకున్న విభేదాల గురించి తాజాగా పెదవి విప్పాడు. తన కెరీర్‌ను సర్వ నాశనం చేయాలని భావించిన చాపెల్‌ను తాను ఇంకా మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నాడు.
‘ఎలెవన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్’ పుస్తకంలో గ్రెగ్ చాపెల్ హయాంలో జట్టులో తలెత్తిన విభేదాల గురించి పేర్కొన్నాడు. క్రికెట్ చరిత్రకారుడు బోరిజా రాసిన ఈ పుస్తకాన్ని సిమన్ అండ్ షస్టర్ ప్రచురించింది. 500 పేజీలున్న ఈ పుస్తకాన్ని ఐపీఎల్ సందర్భంగా విడుదల చేయనున్నారు. భారత క్రికెట్‌కు సంబంధించి మైదానం వెలుపల జరిగే బోల్డన్ని విషయాలను ఇందులో ప్రస్తావించారు.
‘‘ఓ రోజు సాయంత్రం గ్రెగ్ నా వద్దకు వచ్చారు. టెస్టు మ్యాచ్‌కు సెలక్ట్ చేసిన జట్టును నాకు చూపించారు. ఆయన చూపించిన జట్టులో కీలకమైన ఆటగాళ్లు లేని విషయాన్ని గుర్తించాను. ఆయనేం చేయబోతున్నాడో అప్పుడు నాకు అర్థమైంది’’ అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. సెప్టెంబరు 2005లో బులవాయాలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మార్చి 2005లో గంగూలీ ఆరు మ్యాచ్‌ల నిషేధంలో ఉన్న సమయంలో జూలైలో చాపెల్ కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. జింబాబ్వే టూర్ మొదట్లోనే ఏదో జరగబోతోందన్న విషయం తనకు అర్థమైందని ‘దాదా’ పేర్కొన్నాడు. చాపెల్‌కు దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు తన గురించి లేనిపోనివి చెప్పారని, చాలా విషయాల్లో చాపెల్‌తో తాను విభేదించానని గంగూలీ అంగీకరించాడు.
‘‘చాపెల్ సలహాలను నేను చాలాసార్లు తిరస్కరించాను. ఇండియన్ క్రికెట్‌కు మీరేదో చేస్తారని అభిమానులు మీ నుంచి చాలా కోరుకుంటున్నారు. అదే చేయండి అని చాపెల్‌తో స్పష్టంగా చెప్పేశాను’’ అని గంగూలీ తెలిపాడు. ‘‘అయితే చాపెల్ మాత్రం ‘తన టీం’ను సిద్ధం చేసుకుంటున్నట్టు నాకు అర్థమైంది’’ అని గంగూలీ వివరించాడు. ఒకానొక సమయంలో మోకాలి గాయంతో కూడా ఆడాల్సి వచ్చిందని, ఒకరోజు చాపెల్ తన వద్దకు వచ్చి పెద్దగా అరిచేశాడని వివరించాడు. ఆ తర్వాత ఓసారి జట్టులో తన పేరు జాబితాలో కనిపించకపోవడంతో తన కెరీర్‌కు చెక్ పెట్టేందుకు చాపెల్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమైందని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు.