Rahul Gandhi: గణతంత్ర వేడుకల్లో రాహుల్ గాంధీకి అవమానం.. బీజేపీ వివరణ!
- యూపీయే హయాంలో రాజ్ నాథ్, గడ్కరీలను ఎక్కడ కూర్చోబెట్టారు?
- వీఐపీ ఎన్ క్లోజర్ లో కూడా సీటు ఇవ్వలేదు
- కాంగ్రెస్ లా మేము దిగజారలేదు
ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ముందు నుంచి ఆరో వరుసలో కూర్చోబెట్టారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను బీజేపీ అవమానించిందంటూ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ఈ ఆరోపణలపై బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బాలుని స్పందించారు. యూపీఏ హయాంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను ఎక్కడ కూర్చోబెట్టారని ఆయన ప్రశ్నించారు. కనీసం వీఐపీ ఎన్ క్లోజర్ లో కూడా వారికి సీటు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలా బీజేపీ దిగజారలేదని... ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం తమ పార్టీ పని చేస్తోందని చెప్పారు.