baywatch: 'చెత్త' అవార్డుల జాబితాలో ప్రియాంక చోప్రా చిత్రం!
- గోల్డెన్ రేస్‌బెర్రీ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో నామినేట్ అయిన 'బేవాచ్'
- ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ఇది
- మార్చి 3న జరగనున్న అవార్డుల వేడుక
అంతర్జాతీయ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన 'బేవాచ్' చిత్రం 2017లో వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. హాలీవుడ్‌లో ఉత్తమ చిత్రాలను ప్రోత్సహిస్తూ ఆస్కార్‌లు అందజేస్తే... చెత్త చిత్రాలను గుర్తుచేస్తూ గోల్డెన్ రేస్‌బెర్రీ అవార్డులు ఇస్తారు. 2018కి గాను వివిధ కేటగిరీల్లో చెత్త సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల జాబితాను గోల్డెన్ రేస్‌బెర్రీ ప్రకటించింది.
ఇందులో ప్రియాంక చోప్రా తొలి హాలీవుడ్ చిత్రం నాలుగు విభాగాల్లో నామినేట్ అయింది. చెత్త చిత్రం, చెత్త హీరో, చెత్త రీమేక్, చెత్త స్క్రీన్ ప్లే విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఒకరోజు ముందు అంటే మార్చి 3న ఈ రేస్‌బెర్రీ అవార్డుల వేడుక జరగనుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ టీవీ షో 'క్వాంటికో' మూడో సీజన్‌లోను, 'ఈజింట్ ఇట్ రొమాంటిక్' అనే చిత్రంలోను నటిస్తోంది. అలాగే ఆమె నటించిన 'ఏ కిడ్ లైక్ జేక్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా, ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం చెత్త సినిమాల జాబితాలో చోటు సంపాదించుకోవడం అభిమానులకు ఒకింత నిరుత్సాహాన్నే కలిగించింది.