Jagan: అధికారంలోకి రాగానే ఉద్యోగాల విషయంలో కొత్త చట్టాలు తీసుకొస్తా: జగన్
- మన రాష్ట్రం.. మనకే ఉద్యోగాలు
- పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
- 1.42 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం
తాను అధికారంలోకి వస్తే ఉద్యోగాల విప్లవాన్ని తీసుకొస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల ద్వారా మరో లక్షన్నర ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా ప్రణాళికలను వెల్లడించారు. 'మన రాష్ట్రం.. మనకే ఉద్యోగాలు' అంటూ నినదించారు. ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లను జారీ చేసి, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ... నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని జగన్ విమర్శించారు. కొన్ని ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినప్పటికీ, ఆ తర్వాత కోర్టు కేసులు అంటూ నియామకాలను ఆపేశారని చెప్పారు. నల్లధనాన్ని దాచుకోవడానికే చంద్రబాబు దావోస్ వెళ్లారని ఆరోపించారు.