afghanistan: కాబూల్లో ఉగ్ర బీభత్సం... 95 మంది మృతి.. స్పందించిన భారత్
- తామే దాడి చేశామని ప్రకటించుకున్న తాలిబాన్
- హక్కాని హస్తం కూడా ఉన్నట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటన
- ఆప్ఘనిస్థాన్కి అవసరమైన సాయం చేయడానికి సిద్ధం: భారత్
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు మరోసారి బీభత్సం సృష్టించారు. రద్దీగా ఉండే ప్రదేశంలో కారు బాంబు దాడి చేసి 95 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో మరో 163 మందికి గాయాలయ్యాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఈ దాడి వెనుక హక్కాని హస్తం కూడా ఉన్నట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. కాగా, ఈ ఉగ్రదాడిపై భారత్ స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కున్న ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం, ప్రజల వైపున నిలబడతామని భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వానికి అవసరమైన సాయం చేయడానికి, గాయాలపాలైన వారికి చికిత్స అందించడానికి సిద్ధమని భారత్ ప్రకటించింది.