Tirumala: వెంకన్నకు బెల్లం కొరత... చక్కెర పొంగలికే పరిమితం!
- ఆగిన బెల్లం పొంగలి ప్రసాదం
- అధికారుల నిర్లక్ష్యమే కారణం
- క్వాలిటీ రిపోర్టు అందని కారణంగానే అంటున్న అధికారులు
ఏడుకొండల వెంకన్నకు బెల్లం కొరత ఏర్పడింది. దీంతో అన్న ప్రసాదంలో తప్పనిసరిగా వడ్డించే బెల్లం పొంగలి స్థానంలో చక్కెర పొంగలి వచ్చి చేరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తిరుమలకు బెల్లం సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇతర ప్రసాదాల తయారీకి సైతం బెల్లం లేకపోవడంతో తులాభారానికి వినియోగించే బెల్లాన్ని వాడుతున్నారని సమాచారం. వాస్తవానికి తిరుమలలో బెల్లం వాడకం చాలా అధికం. ఒక్క పొంగలి తయారీకే సుమారు 650 కిలోలు వాడతారు.
అయితే, గడచిన 10 రోజులుగా తిరుమలకు ఒక్క కిలో బెల్లం కూడా సరఫరా కాలేదు. తిరుమలకు కావాల్సిన బెల్లం అవసరాలను తిరుపతి మార్కెటింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ వద్ద సుమారు 25 వేల కిలోల నిల్వలు ఉన్నా, ల్యాబ్ క్వాలిటీ రిపోర్టు సమయానికి అందక పోవడంతోనే తిరుమలకు బట్వాడా జరగలేదు. దీంతో గత మూడు రోజుల నుంచి తీవ్ర కొరత ఏర్పడింది. ఇక బెల్లానికి కొరత ఏర్పడిందన్న విషయం మీడియాలో వార్తలు వచ్చిన తరువాతనే టీటీడీ అధికారులకు తెలియడం గమనార్హం. ఆపై తాపీగా నిన్న సాయంత్రం 2 టన్నుల బెల్లాన్ని తిరుమలకు పంపారు