Indian Army: తగ్గిపోయిన యాంటీ-ట్యాంక్ క్షిపణి నిల్వలు.. ఆందోళనలో ఇండియన్ ఆర్మీ
- శత్రు దేశాల ట్యాంకులను అడ్డుకోవడంలో ఏటీజీఎంలు కీలకం
- ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు
- నిల్వలు తగ్గిపోతున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆర్మీ
భారత్ అమ్ముల పొదిలో అత్యంత కీలకమైన యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ (ఏటీజీఎం)ల నిల్వలు తగ్గిపోతుండడంతో ఇండియన్ ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అత్యవసరంగా కొన్నింటిని సమకూర్చాలని కోరింది. ఈ క్షిపణులను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేస్తోంది.
68 వేల ఏటీజీఎంలు, వివిధ రకాలకు చెందిన 850 లాంచర్లు తక్కువగా ఉన్నట్టు ఆర్మీ పేర్కొంది. శత్రు దేశాల ట్యాంకులను అడ్డుకోవడానికి ఇవి చాలా అవసరమని, పదాతి దళాలకు ఇవి అత్యంత ముఖ్యమైన ఆయుధాలని పేర్కొంది. భారత్-పాక్ సరిహద్దులో ఇవి ఎప్పటికీ అందుబాటులో ఉండాల్సిన క్షిపణులని వివరించింది.
ఆర్మీ ఇప్పటికిప్పుడు భుజంపై నుంచి ప్రయోగించే 2500 ఏటీజీఎంలు, 96 లాంచర్లను సిద్ధం చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది చివర్లో ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. మొత్తం 8,356 మీడియం రేంజ్ స్పైక్ ఏటీజీఎంలు, 321 లాంచర్లు, 15 సిమ్యులేటర్ల కోసం రూ.3200 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే గతేడాది చివరల్లో అనూహ్యంగా ఈ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.