Karni Sena: కర్ణిసేన దెబ్బకు.. లిటరేచర్ ఫెస్ట్‌కు ప్రసూన్ జోషి డుమ్మా!
- వివాదాలకు ఆస్కారం ఉండొద్దనే తప్పుకుంటున్నట్టు ప్రకటన
- తన వల్ల ఎవరూ ఇబ్బందులు పడొద్దనే ఈ నిర్ణయమన్న సీబీఎఫ్సీ చీఫ్
- రాజస్థాన్‌లో అడుగుపెట్టనీయబోమని హెచ్చరించిన కర్ణిసేన
‘పద్మావత్’ సినిమా విషయంలో కర్ణిసేన నుంచి బెదిరింపులు ఎక్కువ కావడంతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చైర్పర్సన్ ప్రసూన్ జోషి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జైపూర్‌లో జరగనున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్)కు తాను హాజరు కాబోవడం లేదని తెలిపారు. ఈ ఫెస్టివల్ సృజనాత్మకత మీద దృష్టి సారించాలి తప్పితే వివాదాల మీద కాకూడదనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు.
ప్రసూన్ జోషీని రాజస్థాన్‌లో అడుగుపెట్టనిచ్చేది లేదని ‘శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన’ (ఎస్ఆర్కేఎస్) అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మహాకర్ణ హెచ్చరించిన నేపథ్యంలో సీబీఎఫ్సీ చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీస్తూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయనను విడిచిపెట్టేది లేదని మహిపాల్ హెచ్చరించారు.
ఆదివారం సాయంత్రం జేఎల్ఎఫ్లో ‘మెయిన్ ఔర్ వో: కన్వర్సేషన్స్ విత్ మై సెల్ఫ్’ అనే అంశంపై జోషి మాట్లాడాల్సి ఉంది. అయితే కర్ణిసేన ఆందోళనల నేపథ్యంలో జేఎల్ఎఫ్కు హాజరుకాకూడదని జోషి నిర్ణయించుకున్నారు. కార్యక్రమం గొప్పతనాన్ని కాపాడేందుకే తాను తప్పుకుంటున్నట్టు జోషి తెలిపారు. తాను కనుక హాజరైతే నిర్వాహకులు, సాహిత్య ప్రియులు, రచయితలు, ఇతరులకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘పద్మావత్’ విషయంలో తన ధర్మాన్ని తాను నిర్వర్తించానని స్పష్టం చేశారు.