Pawan Kalyan: ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకుంటే తప్పు ఒప్పుకోండి: పవన్ కీలక వ్యాఖ్యలు
- అన్ని హామీలనూ నెరవేర్చలేకపోవచ్చు
- పరిస్థితులపై ప్రజలకు వివరించాల్సిందే
- లేకుంటే మళ్లీ ఓట్లు అడిగే హక్కుండదు
- పరిటాల సునీత ఇంట్లో పవన్ కల్యాణ్
అధికార పక్షంలో ఉన్న పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన పక్షంలో, ప్రజల ముందు తప్పు ఒప్పుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చే పరిస్థితులు లేకపోవచ్చని, అలాంటప్పుడు, ప్రజలకు విషయం చెప్పాలని సూచించారు. ప్రత్యేక హోదా వంటి అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు బయట పెట్టాలని కోరారు.
ఏ పరిస్థితుల్లో ఆ హామీని నెరవేర్చుకోలేదో వెల్లడించకుంటే, మరోసారి ఓట్లు అడిగే హక్కును కోల్పోతారని హెచ్చరించారు. ఏ పార్టీ పేరునూ వెల్లడించకుండా మాట్లాడిన ఆయన, గొప్ప ఆశయాలతో, తాము చేయదలచుకున్న పనులతో మ్యానిఫెస్టోలను రాజకీయ పార్టీలు తయారు చేస్తుంటాయని, కొన్ని హామీలు నెరవేర్చే దిశలో కోర్టులు కూడా అడ్డు పడతాయన్న విషయం తనకు తెలుసునని చెప్పారు. తనకు ఎవరిపైనా ఆగ్రహం, ద్వేషం లేవని చెప్పిన ఆయన, అభివృద్ధే తనకు ధ్యేయమని చెప్పారు.