beef: కేరళలోని ఓ కాలేజీలో కలకలం... గొడ్డుమాంసంతో చేసిన స్నాక్స్ వడ్డించారని ఆరోపణ!
- కాలేజీ సెమినార్ లో భాగంగా వడ్డించిన స్నాక్స్
- వాటిని తిన్న ఉత్తరాది విద్యార్థులు
- తమ మనోభావాలకు విరుద్ధమంటూ ఆవేదన
కేరళలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ సెమినార్లో భాగంగా వడ్డించిన స్నాక్స్ గొడ్డుమాంసంతో చేసినవంటూ కొందరు ఉత్తరాది విద్యార్థులు ఆరోపణలు చేశారు. తమకు వడ్డించిన కట్ లెట్ ను తిన్న తర్వాతే అది గొడ్డుమాంసంతో చేసిన విషయం తమకు తెలిసిందన్నారు. కాలేజీ యాజమాన్యం తమను తప్పుదోవ పట్టించిందని, ఇది తమ మత మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రకటించారు.
కేరళలోని కుట్టనాడ్ లో ఉన్న కొచ్చిన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం డిజిటల్ బ్యాంకింగ్ పై జరిగిన సదస్సు సందర్భంగా ఇది చోటు చేసుకుంది. ‘‘స్నాక్స్ వడ్డించినప్పుడు అవి శాకాహారమేనా? లేక మాంసాహారమా? అని అడిగాం. అవి శాకాహారమేనన్న సమాధానం వచ్చింది. కొన్ని నిమిషాల తర్వాత వాటిని తిన్న మలయాళీ విద్యార్థులు అవి గొడ్డుమాంసంతో చేసినట్టు గుర్తించారు. గొడ్డుమాంసం తినని శాకాహార విద్యార్థులు సైతం వాటిని తిన్నారు’’ అని ఓ విద్యార్థి తెలిపాడు. అయితే, ఈ సదస్సును నిర్వహించిన బ్యాంకు అధికారులే స్నాక్స్ ను సమకూర్చినట్టు కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ తెలిపారు.