justice: న్యాయమూర్తిగా పదవి చేపట్టిన వెంటనే రాజకీయ సంబంధాలు వదులుకున్నా: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్
- ఓ రాజకీయ పార్టీ వానిగా పేర్కొనడం సరికాదు
- భావ ప్రకటనా స్వేచ్ఛతో ఏది పడితే అది మాట్లాడరాదు
- పౌరులందరికీ సమానత్వం అసాధ్యంగా మారింది
తనను ఓ రాజకీయ పార్టీకి చెందిన వాడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాడే రాజకీయాలతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నట్టు చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవద్దని సూచించారు.
విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి జస్టిస్ చలమేశ్వర్ హాజరై మాట్లాడారు. పౌరులందరికీ సమానత్వం కల్పించాలన్నది మన రాజ్యంగ ధర్మంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లోనూ సమానత్వం సాధించాలన్నది లక్ష్యమన్నారు. కానీ, ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిపోవడం, అవినీతి, వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్నారు.