google: గూగుల్ కొత్త ఫీచర్... రిమైండర్ యాడ్‌ను మ్యూట్ చేసుకునే అవకాశం
- సెర్చ్ చేసిన విషయాలను మళ్లీ మళ్లీ గుర్తుచేసే రిమైండర్ యాడ్స్
- ప్రస్తుతానికి కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే పరిమితం
- త్వరలో యూట్యూబ్, జీమెయిల్‌లో ప్రకటనలకు కూడా వర్తింపు
గూగుల్‌లో ఏదైనా వస్తువును గానీ, విషయాలను సెర్చ్ చేసిన తర్వాత, ఇతర వెబ్‌సైట్లు ఓపెన్ చేసినపుడు అక్కడి ప్రకటనలలో సెర్చ్ చేసిన అంశాలు కనిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. వీటిని రిమైండర్ యాడ్స్ అంటారు. ఇక నుంచి వీటిని మ్యూట్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పించింది. 'మ్యూట్ దిస్ యాడ్' పేరుతో ఈ ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను పరిమితం చేసింది. త్వరలో యూట్యూబ్, జీమెయిల్‌లో ప్రకటనలకు కూడా ఈ ఫీచర్‌ను వర్తించేలా చేయనుంది. రిమైండర్ యాడ్స్ కారణంగా... గతంలో యూజర్ సెర్చ్ చేసిన విషయాలను గుర్తు చేస్తున్న కారణంగా... కొంతమంది యూజర్లు ఇబ్బంది పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. మొదటిసారిగా ప్రకటనలను మ్యూట్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ 2012లో ప్రవేశపెట్టింది. అయితే ఆ ఫీచర్‌ను ఎవరూ పెద్దగా ఉపయోగించుకోలేదు. కానీ రిమైండర్ యాడ్స్ వచ్చిన తర్వాత ఆ ఫీచర్ వాడకం పెరిగింది కానీ రిమైండర్ యాడ్స్‌ని అది నియంత్రించలేకపోయింది.