park: అక్కడి పార్క్‌లో జంటగా అడుగుపెట్టాలంటే వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి!
- కొత్త నియమాన్ని అమలు చేస్తోన్న కోయంబత్తూర్ పార్క్
- పార్క్‌లో యువతీయువకుల పాడుపనులు
- వాటిని నియంత్రించే యోచనలో కొత్త నియమం
పబ్లిక్ పార్కుల్లో కొంతమంది జంటలు చేసే పనుల వల్ల, కుటుంబంతో కలిసి అక్కడికి వచ్చిన వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కేవలం అలాంటి పనులు చేయడానికే పార్కులకు వచ్చే జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి పనులను నియంత్రించే యోచనలో కోయంబత్తూర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా జంటగా పార్కులోకి వెళ్లాలనుకున్న యువతీయువకులు కచ్చితంగా వివాహ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని నిబంధన పెట్టారు.
పొదల మాటున కొన్ని జంటలు చేసే పనుల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పార్క్ నిర్వహణాధికారులు తెలిపారు. పార్కులో తిరుగుతున్నప్పుడు కూడా జంటలు కనిపిస్తే సర్టిఫికెట్ గురించి అడిగే హక్కు అధికారులకు ఉంటుందని, ఆ సమయంలో సర్టిఫికెట్ చూపించలేకపోతే, వారిపై పోలీసు కేసు నమోదు చేస్తామని వారు నిబంధనలో పేర్కొన్నారు.
ఈ నిబంధన కారణంగా పార్కుకి హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయంపై కొంతమంది స్థానికుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పెళ్లై ఉండి, మ్యారేజ్ సర్టిఫికెట్ లేనివాళ్లు పార్కులోకి రాకూడదంటే ఎలా కుదురుతుంది? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు అయ్యుండి, మ్యారేజ్ సర్టిఫికెట్ చూపిస్తే, లోపల వాళ్లు ఏం పాడుపని చేసినా ఫర్లేదా..? ఇదేమైన ఫ్యామిలీ బిజినెస్ పార్కా? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.