Narendra Modi: దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో చర్చ!
- ఢిల్లీలో నిర్వహించిన సమావేశం
- ఈ అంశంపై ఎన్డీఏ పక్షాల అభిప్రాయాలు కోరారు
- అన్ని రాజకీయపార్టీలతో చర్చించాలని నిర్ణయించారు
- ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఢిల్లీలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ అంశంపై అన్ని రాజకీయపార్టీలతో చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్ సభా పక్షనేత తోట నర్సింహం పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు కర్మాగారంతో పాటు పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోదీ దావోస్ పర్యటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన తోట నరసింహం, దావోస్ లో చంద్రబాబు పర్యటన గురించి ప్రస్తావించారు.
భేటీ అనంతరం మీడియాతో సుజనా చౌదరి మాట్లాడుతూ, ‘ఈ అంశంపై ఎన్డీఏ పక్షాల అభిప్రాయాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ విషయమై మా నాయకుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒక సలహా పత్రం ఇవ్వాలని అనుకుంటున్నాం. రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాల గురించి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఇటీవల ఓ వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని పేపర్స్ ని క్లియర్ చేసి సీఎం గారు నాకు ఇచ్చారు. ప్రధానితో కలిసి మాట్లాడతాను. అమిత్ షా ను కూడా కలిసి మాట్లాడే పనులు ఉన్నాయి.
టీడీపీ-బీజేపీ రెండూ మిత్రపక్షాలన్నప్పుడు.. కలసిమెలసి ఎలా ఉండాలనే అంశంపై మాట్లాడతాం. ఈ విషయమై మాట్లాడేందుకు అనుమతి కావాలని కోరేందుకు అమిత్ షాను నేను, తోట నరసింహం కలిశాం. రేపు కలవమని చెప్పారు. ఇరుపార్టీలు కూడా సమన్వయం పాటించాలనేది మా పార్టీ అధ్యక్షుడి ఉద్దేశం’ అని అన్నారు.