u-19 world cup: అండర్-19 వరల్డ్ కప్: సెంచరీతో సత్తా చాటిన శుభ్ మన్ గిల్... పాక్ విజయ లక్ష్యం 273
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 273 పరుగుల లక్ష్యం నిర్దేశించిన భారత్
- 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాక్
అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్ లో హాట్ ఫేవరెట్ భారత్ భారీ స్కోరు చేసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీషా (41), మంజోత్ (47) శుభారంభం ఇచ్చారు. వికెట్ కీపర్ దేశాయ్ (20) ఫర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ బౌలర్లు మ్యాజిక్ చేయడంతో రియాన్ పరాగ్ (2), అభిషేక్ శర్మ (5) త్వరగానే పెవిలియన్ చేరారు.
దీంతో కష్టాల్లో పడిన భారత జట్టును శుభ్ మన్ గిల్ తో జత కలిసిన అనుకుల్ రాయ్ (33) 76 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూ వీరిద్దరూ జట్టు స్కోరును 200 దాటించారు. అనంతరం పాక్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుసగా ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. చివరి బంతి వరకు క్రీజ్ లో నిలబడిన శుభ్ మన్ గిల్ 94 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చెక్కుచెదరని ఏకాగ్రతతో చూడచక్కని షాట్లతో ఆకట్టుకుని, అండర్-19 వరల్డ్ కప్ లో తొలి వ్యక్తిగత సెంచరీని అందుకున్నాడు.
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ మూసా నాలుగు వికెట్లతో రాణించగా, అర్షద్ ఇక్బాల్ మూడు, అఫ్రిదీ ఒక వికెట్ తీసి అతనికి సహకరించారు. అనంతరం 273 పరుగుల విజయలక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించింది. కేవలం 20 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లు పొరెల్ తీయడం విశేషం.