West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడిన బస్సు.. 36 మంది జలసమాధి

  • తెలతెలవారుతుండగా ప్రమాదం
  • పోలీసులు ఆలస్యంగా వచ్చారని స్థానికుల ఆందోళన
  • ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం మమత
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో 36 మంది జల సమాధి అయ్యారు. వీరిలో పదిమంది మహిళలు ఉన్నారు. నదియా జిల్లాలోని షికార్‌పూర్ నుంచి బస్సు మాల్దాకు వెళ్తుండగా ముర్షీదాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు.

పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. అగ్నిమాపక యంత్రంపైనా దాడి చేశారు. ఇప్పటి వరకు 32 మృతదేహాలను వెలికి తీసినట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని, మరో రెండు మృతదేహాలు నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. సహాయక చర్యలకు 8 గంటలు పట్టినట్టు తెలిపారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, లేదంటే పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు,  తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.  

  • Loading...

More Telugu News