english song: ఇంగ్లిష్ పాటతో మోదీకి పంచ్ విసిరిన రాహుల్ గాంధీ
- ఆర్థిక సర్వేను ఉద్దేశించి రాహుల్ ట్వీట్
- డోన్ట్ వర్రీ... బీ హ్యాపీ అంటూ వ్యంగ్య సలహాలు
- తెలివిగా ట్వీట్లు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు
నిన్న కేంద్ర ప్రభుత్వం లోక్సభలో 2017-18 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఓ ఇంగ్లిష్ పాటతో మోదీ ప్రభుత్వ పాలనను ఆయన వర్ణించిన విధానం బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అచ్చే దిన్ (మంచి రోజులు) వచ్చేశాయి.. కానీ కొన్ని చిన్నచిన్న లోపాలు మాత్రం ఉన్నాయంటూ.. పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, జీడీపీ వృద్ధి అన్నీ తిరోగమనంలో ఉన్నాయని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ సమస్యల గురించి పట్టించుకోకుండా ఆనందం కొనసాగాలి అనే ఉద్దేశంతో 'డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ' అనే ఇంగ్లిష్ పాటను పోస్ట్ చేశారు. ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ బాబీ మెక్ఫెరిన్ పాడిన ఈ పాటను ట్వీట్ చేసి.. తనదైన శైలిలో రాహుల్ పంచ్ వేశారు. గతంలో 'మన్ కీ బాత్' సలహాల గురించి కూడా రాహుల్ ఫన్నీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.