Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ సీఎంపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్
- సైన్యంపై కేసు నమోదు చేసిన జమ్ముకశ్మీర్ పోలీసులు
- మెహబూబా ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్వామి
- సైన్యంపైనే కేసు పెడతారా అంటూ ఆగ్రహం
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. భారత సైన్యంపైనే కేసు నమోదు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యం పైనే కేసు పెట్టేలా ఆమె తీసుకున్న నిర్ణయం అర్థంపర్థం లేనిదని విమర్శించారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకోవాలని... విచక్షణాధికారాలను ఉపయోగించి, వెంటనే ఆమె ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మెహబూబా నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్ర కేబినెట్ నుంచి బయటకు రావడానికి బీజేపీ నేతలు సిద్ధం కావడం కలకలం రేపుతోంది.
సైన్యం కాల్పుల్లో ఇద్దరి మృతి..
దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని గోవాంపురా ప్రాంతంలో శనివారం నాడు సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మంది నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాదు, ఓ అధికారి నుంచి ఆయుధం లాక్కునేందుకు యత్నించారు. దీంతో, వారిపై సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిరసనకారులు చనిపోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, కశ్మీర్ లోయలో పరిస్థితి వేడెక్కింది. వేర్పాటువాదులు ఒకరోజు బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు, కాల్పులు జరిపిన సైన్యంపై జమ్ముకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గర్వాల్-10 బెటాలియన్ పై హత్య, హత్యాయత్నం కేసును నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలంటూ సైన్యాన్ని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు.