jaipur: జైపూర్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆటో డ్రైవర్!
- ప్రకటించిన జైపూర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్
- ఏడేళ్లుగా స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకెళ్తున్న దీపక్
- పరిశుభ్రత గురించి తన వంతు ప్రచారం
దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమ పరిధిలో ఉన్న సెలెబ్రిటీలను ఎంపిక చేస్తుంటారు. వారు ఒక్కసారి రోడ్లు ఊడ్చి ఫొటోలకు పోజులిచ్చి తర్వాత తమ కర్తవ్యాన్ని మరిచిపోతుంటారు. కానీ జైపూర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అశోక్ లాహోటి మాత్రం మరోలా ఆలోచించారు. జైపూర్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ కార్యక్రమానికి ఓ ఆటో డ్రైవర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.
గత ఏడేళ్లుగా స్కూల్ పిల్లలను ఆటోలో తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్ దీపక్ పరిశుభ్రత గురించి తన వంతు ప్రచారం చేస్తున్నాడు. ఆటోలో వెళ్తున్నప్పుడు పిల్లలు.. తాము తిన్న చాక్లెట్ కవర్స్‌ను, ఇతరత్ర వస్తువులను రోడ్డుపై పడేయడం తనకు నచ్చలేదు. దీని వల్ల నగరం అపరిశుభ్రంగా మారుతుందనే భావన ఏర్పడింది. దీంతో తన ఆటోలోనే ఒక చెత్త డబ్బాను ఏర్పాటు చేసి.. చెత్తను అందులో వేయమని పిల్లలకు సూచించడం వంటి గొప్ప పనులు ఆయన చేశారు. అంతేకాకుండా తన ఆటోలో ఎక్కే సైనికులు, గర్భిణులు, పారిశుద్ధ్య కార్మికులకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటాడు.
ఇటీవలే మేయర్ అశోక్ లాహోటి నివాసముండే ప్రాంతానికి ఆటోలో ఒక వ్యక్తిని తీసుకెళ్లిన దీపక్, అక్కడ మేయర్‌ని కలిసి తాను చేస్తున్న పని గురించి చెప్పడంతో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారని దీపక్ తెలిపాడు. అందుకు తనకు గర్వంగా ఉందని, పరిశుభ్రత గురించి తన ప్రచారాన్ని మరింత విస్తరిస్తానని పేర్కొన్నాడు.