NASA: అంతరిక్షంలో తప్పిపోయిన నాసా ఉపగ్రహం జాడ తెలిసింది!
- 'జుమా' ఉపగ్రహం కోసం వెతుకుతుంటే 'ఇమేజ్' ఉపగ్రహం దొరికింది
- 12 ఏళ్ల క్రితం అంతరిక్షంలో తప్పిపోయిన 'ఇమేజ్' ఉపగ్రహం
- తాజాగా అంతరిక్షంలో తప్పిపోయిన 'జుమా' ఉపగ్రహం
అంతరిక్షంలో కనిపించకుండా పోయిన అమెరికా ఉపగ్రహం జాడ సుమారు 12 ఏళ్ల తరువాత అనూహ్యంగా లభ్యమైంది. అమెరికా సైనిక అవసరాల నిమిత్తం ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ-‘నాసా’ ‘ఇమేజ్’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అయితే అది అంతరిక్షంలో తప్పిపోయింది. దీంతో తాజాగా అమెరికా సైనిక అవసరాల నిమిత్తం ‘జుమా’ అనే ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించగా, అది కూడా కనిపించకుండా పోయింది. దీంతో ఈ ఉపగ్రహం కోసం స్కాట్ టిల్లీ అనే ఔత్సాహిక ఖగోళశాస్త్రజ్ఞుడు విశ్వంలో శోధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఒక సంకేతాన్ని గుర్తించి, దానిని డీకోడ్ చేసే ప్రయత్నం చేశాడు.
అది భూ-అయస్కాంతావరణంపై సౌరగాలుల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన 'ఇమేజ్' ఉపగ్రహం నుంచి వెలువడిన సంకేతంగా నిర్ధారణ అయింది. 2000 మార్చి 25లో ప్రయోగించిన ఉపగ్రహాల్లో వినియోగించిన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ వెర్షన్లు అప్ గ్రేడ్ అయ్యాయని, అయితే ఈ ఉపగ్రహంలో సంకేతాలు ఇచ్చిపుచ్చుకునే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ మొత్తం ఇమేజ్ లో పాడైపోయిందని నాసాకు చెందిన గాడ్డార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ తెలిపింది. దీంతో ఆ ఉపగ్రహంలో సంకేతాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ పని చేయడం లేదని, అయితే అది పంపే సంకేతాలను రివర్స్ ఇంజనీరింగ్ విధానం ద్వారా విశ్లేషించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపింది.