Mumbai: 149 ఫోర్లు, 67 సిక్సర్లు.. బౌలర్లను ఆటాడుకున్న క్రికెటర్.. 1,045 పరుగులతో మోత మోగించిన 13 ఏళ్ల కుర్రాడు!
- బౌలర్లను ఆటాడుకున్న తనిష్క్
- సెమీస్ మ్యాచ్లో విశ్వరూపం.. ఒక్కడే వెయ్యి పరుగులు చేసిన వైనం
- అధికారక మ్యాచ్ కాకపోవడంతో ప్రపంచ రికార్డు మిస్
ఇది కనుక అధికారిక మ్యాచ్ అయి ఉంటే 13 ఏళ్ల తనిష్క్ గవాటే పేరిట ప్రపంచ రికార్డు నమోదై ఉండేది. అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కోపార్ కహిరానె- నవీ ముంబై జట్ల మధ్య మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో తనిష్క్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 1,045 పరుగులు చేశాడు.
రెండేళ్ల క్రితం భండారీ కప్ ఇంటర్-స్కూల్ టోర్నమెంట్లో భాగంగా ప్రణవ్ ధనవాడే 1,009 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును తనిష్క్ తిరగరాశాడు. 1009 పరుగులు చేసిన ధనవాడే స్కూల్ క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 1899లో అర్ధర్ కోలిన్స్ చేసిన 628 పరుగుల రికార్డును తుడిచిపెట్టేశాడు.
యశ్వంత్ రావ్ చవాన్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్ తాజాగా 515 బంతుల్లో 149 ఫోర్లు, 67 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్లో తనిష్క్ అజేయంగా 316 పరుగులు చేయడం విశేషం. అతడి బ్యాటింగ్ శైలిని, ఎనర్జీని చూసిన క్రీడా పండితులు ఆశ్చర్యపోతున్నారు. తనిష్క్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.