voynich manuscript: మనిషి చదవలేని భాషను కృత్రిమ మేధస్సు చదివేసింది!
- తవ్వకాల్లో బయటపడిన 15వ శతాబ్దపు ‘వోయెనిచ్ రాతప్రతి’
- దీనిని చదివేందుకు, విశ్లేషించేందుకు తలలు బద్దలు కొట్టుకున్న శాస్త్రవేత్తలు
- దీని విశ్లేషణకు 400 భాషలు ఉపయోగించిన శాస్త్రవేత్తలు
- దీని రహస్యం విప్పిన గూగుల్ ట్రాన్స్ లేట్
మనిషి మేధస్సుకు అందనిదిగా మిగిలిన 15వ శతాబ్దపు (600 ఏళ్ల క్రితం నాటి) గజిబిజి లిపి, రకరకాల చిత్రపటాలతో ఉన్న రాతప్రతి మిస్టరీని కృత్రిమ మేధస్సు విప్పింది. దాని వివరాల్లోకి వెళ్తే... 15వ శతాబ్దానికి చెందిన ‘వోయెనిచ్ రాతప్రతి’ చరిత్రకారులకు లభ్యమైంది. అయితే దీనిని చదవడం, విశ్లేషించడం చరిత్రకారులకు, గూఢలిపిని తర్జుమా చేసేవారికి సాధ్యం కాలేదు. దీంతో ఈ ప్రతి పెద్ద పజిల్ గా మిగిలిపోయింది. ఎలాగైనా దీని అర్థం తెలుసుకోవాలని భావించిన శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు సహాయం తీసుకున్నారు. కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిని చదివేందుకు ప్రపంచవ్యాప్తంగా 400 విభిన్న భాషలను ఉపయోగించుకున్నారు.
ఎట్టకేలకు గూగుల్ ట్రాన్స్ లేటర్ ద్వారా ఈ రాతప్రతి హిబ్రూ భాషలో ఉందని నిర్ధారించుకున్నారు. తొలుత ఇది అరబిక్ భాషలో ఉందని భావించినట్టు వారు తెలిపారు. అయితే చివరకు హిబ్రూ భాషలో రాసినట్లు తేలిందని ప్రొఫెసరు గ్రెగ్ కొండ్రాక్ చెప్పారు. 80 శాతం పదాలు హిబ్రూ నిఘంటువులో ఉన్నట్లు తెలిసినప్పటికీ, రాతప్రతిలో ఏం రాశారో తర్జుమా చేయడం ఏ మేధావి వల్ల కాలేదని ఆయన చెప్పారు. ఎట్టకేలకు గూగుల్ ట్రాన్స్ లేటర్ రహస్యాన్ని విప్పిందని ఆయన చెప్పారు. అయితే ఆ రాతప్రతి ‘ప్రజలకు, నాకు, ఇంట్లో వ్యక్తికి, పూజారికి ఆమె సలహాలు ఇచ్చింది’ అనే వాక్యంతో మొదలుకావడం విచిత్రంగా ఉందని ఆయన తెలిపారు.