Sonia Gandhi: రాహుల్ కాదు.. సోనియానే .. యూపీఏ చైర్‌పర్సన్‌పై వీరప్ప మొయిలీ స్పష్టత
- విపక్షాలను ఏకం చేసే సత్తా సోనియా సొంతమన్న సీనియర్ నేత
- యూపీఏ చైర్పర్సన్ బాధ్యతలను రాహుల్ స్వీకరించబోరన్న వీరప్ప మొయిలీ
- 19 ఏళ్లుగా బాధ్యతలు మోస్తున్న సోనియా
యూపీఏ చైర్పర్స్న్ గా సోనియా గాంధీ కొనసాగుతారని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే సత్తా సోనియాకు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. సోనియా గాంధీ 19 ఏళ్లుగా యూపీఏ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ త్వరలోనే తన తల్లి నుంచి యూపీఏ చైర్పర్సన్ బాధ్యతలు కూడా స్వీకరిస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో స్పందించిన మెయిలీ అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
‘‘యూపీఏ చైర్ పర్సన్‌గా సోనియా కొనసాగుతారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలను ఒక్క చోటుకి చేర్చే సత్తా ఆమెకు ఉంది’’ అని మొయిలీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను ఏకం చేయడం నేషనలిస్ట్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వల్ల కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా మొయిలీ పేర్కొన్నారు. యూపీఏ ఇంకా బలంగానే ఉందని, పవార్ కూడా యూపీఏలో భాగమేనని స్పష్టం చేశారు.