crypto currency: క్రిప్టో కరెన్సీ సంబంధ ప్రకటనలపై నిషేధం విధించనున్న ఫేస్బుక్
- గతంలో వర్చువల్ కరెన్సీకి సానుకూలంగా స్పందించిన సోషల్ మీడియా దిగ్గజం
- ఇన్స్టాగ్రాం సహా అన్ని మాధ్యమాల్లో నిషేధం
- ప్రకటించిన ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం
ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని క్రిప్టో కరెన్సీ బిజినెస్‌ను నియంత్రించేందుకు సోషల్ మీడియా దిగ్గజం నడుం కట్టింది. గతంలో బిట్‌కాయిన్ బూమ్ సమయంలో వర్చువల్ కరెన్సీ లావాదేవీలకు సానుకూలంగా స్పందించిన ఫేస్బుక్ వర్గాలు.. ప్రస్తుతం కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న క్రిప్టో కరెన్సీల కారణంగా వారి నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీన్ని నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌తో పాటు తమ ఇతర మాధ్యమాలైన ఇన్స్టాగ్రాం, ఆడియన్స్ నెట్‌వర్క్‌లలో కూడా క్రిప్టో కరెన్సీ ప్రకటనలపై నిషేధం విధించేందుకు యత్నిస్తోంది.
ఈ మేరకు కొత్త పాలసీ విధానాలను ఫేస్బుక్ రూపొందించింది. క్రిప్టో కరెన్సీలను ప్రచారం చేస్తూ వచ్చే అన్ని రకాల ఆర్థిక ప్రకటనలు, తప్పుదోవ పట్టించే పోస్టులపై నిషేధం విధించబోతున్నట్లు ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాబ్ లీథర్న్ తెలిపారు.